ఆ అమ్మాయి చిరునవ్వు

ఆ చిరునవ్వు నన్ను కదిలించేసింది.. కరిగించేసింది. అంత అందమైన మొహమేమికాదు కాని ఆ కళ్ళలో ఎదో వెలుగు. ఆ కళ్ళని నా జీవితంలో మర్చిపోలేనేమో. ఆ సంస్థ నుంచి బయటకి వస్తుంటే గేటుదగ్గర వస్తున్న బీప్ బీప్ శబ్దం నా గుండెతో లయగా కొట్టుకున్నట్టుంది. రోడ్డు దాటగానే అవతలివైపు అంతులేని సముద్రం. ముంబై మహానగరంలో వర్లీ సీఫేస్ ప్రాంతమది. ఆ సముద్రం మీదుగా వస్తున్న చల్లగాలి నన్ను శాంతిచమంది. అక్కడి ఫుత్‌పాథ్‌పైన వేసిన బెంచీలపై కూర్చొని కళ్ళుమూసుకున్నాను. ఆ రోజు జరిగినవన్నీ కళ్ళముందు మెదిలాయి.


నేను చేస్తున్న ఎంబీయేలో భాగంగా ఒక ప్రాజక్ట్ విషయమై ఆ సంస్థలో అడుగుపెట్టాను. నాకు కావల్సిన వివరాలు సేకరించిన తరువాత బయల్దేరబోతుంటే ఆ సంస్థ రిసోర్స్ మొబిలైజేషన్ శాఖలో పనిచేస్తున్న జేరూఖాన్ చిన్నమాట అంటూ నన్ను ఆపేసారు.


"ఈ రోజు మా సంస్థలో ఒక ఈవెంట్ వుంది.. మీరుకూడా వుండి చూస్తే మాకు చాల సంతోషం" అన్నదామె హిందీలో."ష్యూర్" అని ఆమెతోపాటే మెట్లుదిగి కిందికి వచ్చాను. అక్కడే ఈవెంట్ జరగబోతోందని చెప్పారావిడ.


వారం రోజులుగా ఆ సంస్థలో ట్రైనింగ్ పొందిన యువతీ యువకులు, ఆ రోజు తల్లిదండ్రులు, అతిథుల ముందు వాళ్ళు నేర్చుకున్నది ప్రదర్శించబోతున్నారు. కొంతసేపటికి ప్రదర్శన ప్రారంభమైంది. యువకులంతా ఒక ఇనుప పోల్ మీద యోగాసనాలు ప్రదర్శించారు. ఆడపిల్లలంతా అవే ఆసనాలను ఒక వ్రేలాడుతున్న తాడు పై చేసి చూపించారు. ఏమైన ఆ ఆసనాలు కొంచం కష్టమనే చెప్పాలి.


మేము చప్పట్లు కొట్టినప్పుడల్లా వాళ్ళ సంతోషం ముఖంలో వెలుగై పూస్తోంది. ప్రతి అభినందనకి వారంతా రెట్టించిన వుత్సాహంతో ప్రదర్శిస్తున్నారు. ఆక్కడ నిలబడ్డ తల్లి దండ్రులకు అంతా సంభ్రమంగా వుంది. అసలు ఇన్ని ఫీట్లు చేస్తున్నది తమ పిల్లలేనా అని ఆశ్చర్యపోతున్నారు. దాదాపు అరగంట జరిగిన కార్యక్రమంలో నెను చప్పట్లు ఆపనేలేదు.. అసలు ఆపబుద్దే వెయ్యలేదు. అంతా అయిపోయిన తరువాత కలిశానా అమ్మాయిని. పద్దెనిమిది పంతొమ్మిదేళ్ళుంటాయేమో ఆ పిల్లకి. అనుకోకుండా వచ్చి నాకు తగిలింది.


సారీ చెప్తూనే "ఎలా చేసాను సార్ నేను" అంటూ అడిగింది.

"బ్రహ్మాండం" అన్నానేను.

ఆ అమ్మాయి నవ్వింది.

మ నో హ రం గా...

ఎంత స్వచ్చంగా వుందా నవ్వు...

నేను ఆమె వైపే చూస్తూవుండిపోయాను. ఆ అమ్మాయి మాత్రం నన్ను చూడట్లేదు.

నేను చొరవ చేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని "నిన్ను నీ రూందగ్గర వదిలి పెట్టనా..?" అని అడిగాను.ఆ అమ్మాయి మళ్ళి నవ్వింది -

"నా అంతట నేను వెళ్ళగలను.." అంటూ నా చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది

అంతే.. ఇదుగో.. నేనిక్కడ సముద్రపువొడ్డున బెంచీపై కూర్చొని.. ఎంతసేపు అలావుండిపోయానో నాకే గుర్తులేదు. ఏమేమి ఆలోచించానో తెలియదు. కూర్చున్నాను అంతే.. ఇలాంటిచోట పని చెయ్యాల్సి రావటం నా అదృష్టమేమో.. రేపు ఇలాంటిదే మరో సంస్థకి వెళ్ళాలి. అక్కడ ఇంకేమనుభవముందో.. లేచి నిలబడి టాక్సి ఆపాను -

"దాదర్" చెప్పాను ముక్తసరిగా.

టాక్సి కదలబోయే ముందు మళ్ళి ఒక్కసారి ఆ బిల్డింగ్ వైపు చూసాను -

నల్లటి గేటు మీద తెల్లటి అక్షరాలతో ఆ సంస్థ పేరు రాసుంది -"నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్"


(ఇది కథ కాదు. మూడేళ్ళ క్రితం నాకు అనుభవమైన సంగతి)

1 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

Nothing to be surprised. I have known one Bengali guy in NY area who is deaf and blind and works full time at Hellen Keller Institute there. The blind people also play chess and can watch movies. This bengali guy lives alone in his apartment with his guide dog and cooks all by himself and he is on his own.

It is the DOURBHAGHYAM of India that we still treat handicapped people as 'separate.' May be India needs another 200 years to formulate the EOE/AA laws - let alone follow them.