గుండెపై గొడ్డలివేటు

నేలకి ఒకటిన్నర అడుగు ఎత్తులో నా శరీరంలోకి దిగబడిందో గొడ్డలి. జివ్వున పాకింది బాధ.. నా శాఖొపశాఖలకు.

మళ్ళి మరో దెబ్బ...!

నా కొమ్మలపై గూళ్ళు కట్టుకుని వుంటున్న పిట్టలన్ని చివాల్న లేచి నిద్రమత్తును దులుపుకున్నాయి. ఒక్కొక్క దెబ్బ పడుతునేవుంది. నాకు తెలుసు ఈరోజు నన్ను నరికించి అక్కడ కార్ షెడ్డు కట్టుకోబోతున్నారని. అలాగని శేఖరం నిన్న సాయంత్రమే నిర్ణయించాడు. తెల్లవారుతూనే ఇదుగో ఇలా...

నా కథ ఈ రోజుతో ముగిసిపోతోంది. నేను పుట్టి ఎన్నాళ్ళైందో...? బహుశా నూటాభై యేళ్ళు..?? లేక ఇంకా పైనే నేమో..??

ఇన్నేళ్ళలో ఎన్ని అనుభూతులు..? ఎన్ని అనుభవాలు..?? ఎన్నన్నని చెప్పను.

మా వూరి జమిందారు, రాజావారు వస్తున్న సందర్భంలో నా నీడలో ఏర్పాటు చేసిన గానా బజానాలు.. చల్లని రాత్రుళ్ళో నా చెట్టుకింద జరిగిన తోలుబొమ్మలాటలు, శేఖరం తాతగారు ఈ స్థలంలో ఇల్లు కడుతూ "పచ్చని చెట్టు ఇంటిముందుంటే మనమూ పచ్చగా వుంటాము" అంటూ ఆప్యాయంగా నన్ను నెమరిన సంగతి.. ఆ తరువాత నా చెట్టునీడలో పిల్లకి పాఠాలు చెప్పడం.. ఎన్నో మధుర స్మృతులు.

శేఖరం తాతగారు నా కుడివైపు కొమ్మ విరిగినప్పుడు చేయించుకొన్న చేతికర్ర ఇప్పటికీ వారింట్లో వేలాడుతోంది. శేఖరం నాన్నగారు నా ఆకు పసరుతో ఊరందరికి వైద్యం చేసేవాడు. నాకివన్నీ గుర్తే.. మరి శేఖరానికి గుర్తులేవా..?? బడి ఎగ్గొట్టడానికి నా పైకి ఎక్కి కూర్చున్న రోజులు, నా చుట్టు తిరుగుతూ ఆడుకున్న ఆటలు.. ఇవన్నీ మర్చిపోయాడా..? అయ్యో నన్ను ఇంతకాలం తన నేస్తంలా చూస్తున్నాడనుకున్నానే..!!

నాపైన ఏం హక్కున్నదని నన్ను కొట్టిస్తున్నాడు? అతనింట్లో వున్నంత మాత్రాన నేనతని సొత్తేనా..?? నేను ప్రకృతినికదా..!

అబ్బా.. అబ్బా ఈ గొడ్డలి దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను. ఎంత కర్కశులీ మానవులు.? శేఖరం కూతురు భవాని అక్కడే నిలబడి చిత్రంగా నావైపు చూస్తోంది. చూడటానికి ఎంత ముద్దుగా వుందో.. వసంతంలో నేనున్నట్లు..!!

ఒకరోజు అన్నం తిననని మారాం చేస్తూ నా చుట్టు తిరగబోయి నా వేర్లు తగులుకొని కింద పడ్డప్పుడు చెయ్యి అందించలేని నా అశక్తతకు ఎంత విలపించానో నాకు తెలుసు. ఈ పాపకు కూడా నా మీద దయ లేదా..? నా నీడ లో కూర్చొనే కదా -

"చెట్లు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి.. చెట్లు నరకడం వల్ల కాలుష్యం పెరుగుతుంది.. వృక్షో రక్షతి రక్షితః " అంటూ పాఠాలు చదివింది.

మరో పోటు నాలో దిగబడింది. కొద్దిగా తూలుతున్నాను. నా పైనున్న పక్షులన్నీ రెక్కలు టపటపలాడించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఒంటరి రాత్రులలో ఇవే కదా నాకు నేస్తాలు..? ఎన్ని పగళ్ళు వీటి బిడ్డలకు కాపలా కాశాను..? ఎన్ని రాత్రులు నా వెచ్చటి ఆకుల దుప్పట్లు కప్పుకొని ఇవి పడుకున్నాయి..? ఈ రోజు ఇలా విడిచి వెళ్ళిపోవలసినదేనా..?

నా చివరి కొమ్మ మీద తేనెపట్టు ఒకటుంది. ఆ తేనెటీగలు నా రక్షణకొచ్చాయి. నన్ను గొడ్డలితో కొడుతున్న వీరయ్య మీదకి వురుకాయి. తేనెటీగలు కుట్టడంతో వీరయ్య గొడ్డలి వదిలి దూరంగా జరిగాడు. తరువాత పొడవాటి కర్ర తెచ్చి ఆ తేనెపట్టును కదిపాడు. నా నుంచి ఏదో భాగాన్ని వేరు చేసినట్లైంది. తేనె పట్టు తొలగించి దూరంగా వున్న తన కొడుకుకు ఇచ్చాడు. చిత్రం ! తేనెటీగలు ఒక్కటీ ఇటు రాలేదు. వాటికీ ఎంత స్వార్ధం..! వాటికి ఆసరాగా నిలిచిన నన్ను అంతలోనే మర్చిపోయాయా..??

మళ్ళి మొదలయ్యాయి గొడ్డలిపోట్లు... ఒంటరినై బాధగా ఈ దెబ్బలను భరిస్తున్నాను.

అప్పుడు పలికింది భవాని...

"నాన్నా! ఈ చెట్టును కొట్టేయద్దు నాన్నా.. ఇదెంతో మంచి చెట్టు నాన్నా.. మనకి చాలా పండ్లిచ్చింది కదా నాన్నా"

చాలు..! నా జన్మకిది చాలు..!! ఎంత ప్రేమగా చెప్పింది భవాని. ఇద్దామంటే నా వంటి మీది పళ్ళన్నీ నిన్ననే దులిపేశారు. గొడ్డలి దెబ్బలకు కాండం చివరిదాక వచ్చింది. మరో రెండు దెబ్బలు.. అంతే..!!

ఈ లోగా భవానికి ఏదో ఒకటి ఇవ్వాలి. నా శరీరాన్ని పూర్తిగా పరికించాను. ఎక్కడో ఒక మూల చివర ఆకులచాటున వుంది దోరమాగిన పండు.

గొడ్డలి దెబ్బ మరికటి పడింది..నా కొమ్మలని కదుపుతూ ఆ కాయను కోస్తున్నాను..మరో దెబ్బ...! అదుపు తప్పి వూగిపోతున్నాను.. కాయను గట్టిగా కోస్తున్నాను...ఇక వొరిగిపోతున్నాను.. సరిగ్గా అప్పుడు తెగిన కాయ భవాని ముందు పడింది. నేను క్రింద పడిపోతూ వున్నాను. వీరయ్య చిన్నగా నవ్వి చెమట తుడుచుకుంటున్నాడు.

మగత కళ్ళు మూతలు పడుతుండగా భవాని వైపు చూసాను. కిందపడిన పండుని అందుకొని పరుగున శేఖరం దగ్గరకు వెళ్ళింది.

"నాన్నా నేను ఈ పండు పెరట్లో నాటుతాను నాన్నా.. మళ్ళి ఇలాంటి చెట్టే వస్తుంది.." అంటోంది వాళ్ళ నాన్నతో.

నేను ఆనందంగా కళ్ళు మూసుకున్నాను.("వాయిస్ - విద్యుల్లత" పర్యావరణ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ, సెప్టెంబరు 1997)

Category:

3 వ్యాఖ్య(లు):

రిషి చెప్పారు...

బాగుంది మాష్టారూ కథ.

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

మంచి సందేశాత్మక కథ.. బాగుంది...

Sarath చెప్పారు...

చాలా చాలా బాగుంది.