ఇండోరులో సంక్రాంతి సంబరాలు - తెలుగు బ్లాగుల ప్రచారం


ఆంధ్రరాష్ట్రమంతా జనవరి 14వ తారీఖున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటే ఇక్కడ ఇండోరు (మ.ప్ర.)లో ఒకింత ఆలస్యంగా ఆ సంబరాలు జరిగాయి. సంక్రాంతి లక్ష్మి రైలెక్కి ఇక్కడిదాకా రావాలి కదా మరి. (ఇక్కడ సంక్రాంతికి సెలవు ఇవ్వరు కాబట్టి ఆ తరువాత వచ్చే ఆదివారం అనువైనదిగా భావించారు). నేను ఈ సంబరాలు జరుగుతున్న చోట కారు దిగుతుంటే ముఖద్వారం గుమ్మం దగ్గర "సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ ఇద్దరు గంగెరెద్దులవాళ్ళ బొమ్మలు స్వాగతం పలికాయి. వెంటనే ఈ బొమ్మ ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాను - అది నా బ్లాగులో నేను పెట్టుకున్న సంక్రాంతి శుభాకాంక్షలు బొమ్మ.

అప్పుడు గుర్తొచ్చింది ఈ కర్యక్రమం నిర్వహిస్తున్న ప్రసాద్‌గారికి, శ్రీధర్‌గారికి నేను వచ్చే విషయాన్ని మైల్ చేస్తూ, అందులో తెలుగు బ్లాగుల గురించి వివరంగా వ్రాశాను. అవకాశం వుంటే ఇండోరులో తెలుగువారికి తెలుగు బ్లాగులు పరిచయం చేస్తానని అభ్యర్ధించాను. "ఆ రకంగా నా బ్లాగులు చూసేవుంటారు" అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. లోపలికి వెళ్ళాక నలుగురితో పరిచయమైంది. నా పేరు చెప్పగానే చాలామంది మీరు ఫలానా బ్లాగు నడుపుతారు కదూ అంటూ పలకరించారు. అప్పుడు తెలిసింది నేను పంపించిన మైలు ప్రసాద్‌గారి తెలుగు మిత్రులకి ఫర్వార్డ్ అయ్యిందని.

కార్యక్రమం మొదలు కావటానికి మరికొంత సమయం పట్టేట్టుండటంతో నాగార్జున ఫర్టిలైజర్స్ నుంచి వచ్చిన మిత్రులు ధనంజయ్‌రెడ్డిగారు, కిరణ్‌గారు కలిసి ఆ పరిసరాల్లో తిరిగాము. ఇంతకీ ఇది జరిగిందెక్కడో చెప్పలేదుకదూ - ఇండోరుకి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. పద్నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి సహజ ప్రకృతిలో అద్భుతంగా వుందా ప్రాంతం. పూర్తిగా సెక్యూరిటీ కనుసన్నల్లో వుండే ఆ ప్రాంతంలో సైంటిస్ట్‌లు ఇతర సిబ్బంది వుండే క్వార్టర్స్, పిల్లల స్కూలు దాటి రీసర్చ్ సెంటర్ వెళ్తుంటే ఓక్క పెద్ద సహజ కోనేరు ఆహ్లాదంగా కనిపించింది. దిట్టమైన అడవిని తలపిస్తూ రోడ్డుకు ఇరువైపులా చెట్లు. అంతలో మాకు పదడుగుల దూరంలో ఒక పదిదాకా నెమళ్ళు దర్జాగా ఎదో ఫామిలీ మొత్తం మార్నిగ్‌షోకి బయలుదేరినట్టు వరసగా రోడ్డు దాటుతూ కనిపించాయి. అంత బాగుందో అలా చూస్తుంటే.. ప్రకృతిని తనపాటికి వదిలేసి మనం కేవలం ప్రేక్షులమైతే ఇంకెన్నో అధ్భుతాలు ఆవిష్కారమౌతాయేమో అనిపించి...!! నిజంగా అక్కడి వుంటున్నవారు సహజ ప్రకృతిని ఏమీ చెయ్యకుండా అందులో కలిసిపోయి జీవిస్తున్నారు... ఎంత అదృష్టం. ఎలా అనుకుంటూ మేము కార్యక్రమం జరుపుకుంటున్న వెల్ఫేర్ సెంటర్ దగ్గరకి చేరుకున్నాం.
వెంటనే టిఫిన్ల మీద పడ్డాము. "వుప్మా చేసినట్టున్నారండీ.." అని నేనంటే -
"పోహా తప్ప ఏది పెట్టినా ఫర్లేదండీ.." అంటూ ఒక బ్యాచిలరు మిత్రుడు ఆనందంగా ప్లేటందుకున్నాడు. (ఇక్కడ ఇండోరులో వుదయం దొరికే టిఫిన్ పోహ, జిలేబి మాత్రమే). మేము అలా టిఫిన్లు కానిచ్చి లోపలికి వెళ్ళి చూసే సరికి బొమ్మల కొలువు సిద్ధంగా వుంది. సాంప్రదాయాన్ని పాటిస్తూ మామిడి తోరణాలు, గడపలకి ఇరువైపులా అరటి మొలకలు అలంకరణలో సైతం చరకు గడలు, పతంగులు, బంతి పువ్వులు కనిపించి సంక్రాంతి సంబరాలకి అచ్చ తెలుగు అందాలద్దాయి.

ఆ తరువాత చిన్న పిల్లలకి ఆటల పోటీలు ఆడవారికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమం నిర్వహిస్తున్న సెంటర్ వాకిట్లో పోటీ నిర్వహించడంతో మరో అరగంటలో సంక్రాంతి లక్ష్మి రంగులద్దుకొని మరీ మా ముంగిట్లోలోకి వచ్చింది. పోటీలో పాల్గొన్న పెద్దలే కాక పోటీలేకపోయినా కొంతమంది చిన్న పిల్లలుకూడా ముగ్గులేసి రంగులద్ది మురిసిపోయారు. ఒక పక్క శాస్త్రిగారు తదితరుల ఆధ్వర్యంలో హిందీ వంటవాళ్ళు పులిహోర, కొత్తిమీర కారం, మామిడికాయ పప్పు లాంటి తెలుగు వంటకాలు చేస్తూ, నేర్చుకుంటున్నారు.

ఇంతలో మగవారి కబడ్డీ పోటీలు జరిగాయి. ఆడవారికి మ్యూజికల్ చైర్స్.. ఇంతలో మ్యూజిక్ సరిగా వినపడట్లేదంటూ మహిళల కంప్లైంటు..!! రమేష్‌గారు వెంటనే ఒక స్టీలు పళ్ళెం, గరిట తెచ్చిచారు. ఆ పని నేను తీసుకున్నాను.. బాపు మిస్టర్ పెళ్ళాంలో బుడుగులా.. డండర డండర డండర ఢాం..!! పోనీలే సంక్రాంతి పండక్కి జంగందేవర కూడా వచ్చినట్టైంది అన్నారెవరో సరదాగా..!!

భోజనాల దగ్గరకి వెళ్ళేసరికి పెద్ద క్యూ... ఆవకాయ అయిపోతోంది.... ఇంకో సీసా మళ్ళీ ఖాళి..!! "ఎంతైనా తెలుగువాళ్ళం కదా. అవకాయని బతకనిస్తామటండీ" అంటూ ఫణీంద్రగారు పచ్చడి గిన్నెలో అన్నం వేసి సుబ్బరంగా కలిపేసారు. ఈ ఆలోచన నచ్చి నేను పచ్చడి సీసామీద పడబోయానుగాని అంతలో శాస్త్రిగారు మరో సీసా పట్టుకొచ్చారు. కంది పొడి, నెయ్యి పులిహోర, మామిడికాయ పప్పు, సున్నుండలతో భోజన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తైంది.

ఆ తరువాత తెలుగు పురాణ సాహిత్యంలో క్విజ్.. మచ్చుకు మూడు ప్రశ్నలు -
"సీతాదేవి పుట్టిల్లు ఏది అది ప్రస్తుతం ఎక్కడుంది?"
"పంచ భీములెవరు?"
"సప్త రుషులెవరు..?"

తెలుగు బ్లాగుల ప్రచారం
మధ్యాన్నం టీ వేళకి నేను లాప్‌టాప్ తెరిచాను. ప్రసాద్‌గారి పరిచయంతో ప్రారంభించాము. ప్రసాదుగారు గత వారం రోజులలో నేను పంపిన లంకెలు పట్టుకోని తోటరాముణ్ణి, నా హాస్య దర్బారుని మరో రెండు మూడు బ్లాగుల్ని చుట్టేసారు. లంకెలు, బ్లాగడం, బ్లాగరి వంటి పదాలు అప్పుడే అక్కడ వాడకంలోకి వచ్చేసాయి. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి (తాడేపల్లి గారిని తల్చుకొని) అంతర్జాలము, టైపాటు, త్రిప్పెన గురించి చెప్పాను.

అంతర్జాల అనుసంధానం లేకపోవటంతో ముఖ్యమైన లేఖిని, కూడలి మరికొన్ని సైట్లు ఆఫ్లైన్‌లో భద్రపరుచుకొని వెళ్ళాను. ముందురోజు నేను తయారుచేసుకున్న కరపత్రం పంచి పెట్టాము. "మీ కంప్యూటర్‌కి తెలుగు నేర్పించారా" అంటూ మొదలై - లేఖిని, కూడలి, తెవికి, గూగుల్ గుంపు, పొద్దు, నవతరంగం గురించి క్లుప్తంగా ఆ కరపత్రంలో వివరించాను. అందులో చివరి వాక్యం - "ఈ రోజు జరిగిన సంక్రాంతి సంబరాలు నా బ్లాగు పలక బలపంలో రేపు వస్తుంది చూడండి. "

లేఖినిలో ఇంగ్లీషు తెలుగుగా మారటం చాలామంది ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు.. శాస్త్రిగారు వచ్చి తెనాలి రామకృష్ణ చాటువులు దొరుకుతాయా అని అడిగారు.. ఫణీంద్రగారు తెలుగు సాహిత్యం దొరుకుతుందా అన్నారు.. నారాయణగారు పెద్దబాలశిక్ష, పంచతంత్రం గురించి అడిగారు. అవన్నీ అంతర్జాలంలో ఎలా వున్నాయో చెప్తూ అభినవ భువన విజయం గురించి, తెలుగు థీసిస్‌లో పుస్తకాల గురించి, సౌమ్యగారి పుస్తక సమీక్షల గురించి, సాహితీయానం వంటి కవితల బ్లాగుల గురించి, నిడదవోలు మాలతిగారి కథల గురించి వీలైనన్ని విషయాలని క్లుప్తంగా చెప్పాను. కొంతమంది ఆ బ్లాగుల పేర్లు వ్రాసుకోవటం చూసి చాలా సంతోషమనిపించింది.

చాలా మంది ప్రముఖంగా ప్రస్తావించిన విషయం: "మా పిల్లలకి తెలుగు మాట్లాడటం వచ్చు. చదవటం, వ్రాయటం నేర్పడానికి ఏవైనా వెబ్‌సైట్లు/సాఫ్ట్‌వేర్లు వున్నాయా?" ఇలా అడిగిన వారిలో ఎక్కువ శాతం ఎంతో కాలంగా ఇక్కడే స్థిరపడినవారు. సాయంత్రం అతిదిగా వచ్చిన డీ.ఐ.జీ శ్రీనివాస్‌గారు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

సాంస్కృతికం ఆ సాయంత్రం
సాయంత్రం చిన్న పిల్లల ఆటలు పాటలతో ఎంతో వుత్సాహంగా గడిచింది. మరీ చిన్న పిల్లలు ఏమాత్రం బెరుకు లేకుండా చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. ముఖ్యంగా "ముద్దుగారే యశోద" పాటకు పూర్తి క్లాసికల్ ఆహార్యంతో నటిస్తున్న ఇద్దరి పిల్లమధ్యకి మరో చిన్న పిల్లాడు అనుకోకుండా చేరి అడుగులు కలపటంతో పలువురు ఘొల్లుమన్నారు. నాకైతే పడమటి సంధ్యారాగంలో జంధ్యాల తీసిన పాట గుర్తిచ్చింది. అలాగే ముంబై 26/11 మృతులకు శ్రద్దాంజలి నృత్యం చాలా బాగుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్తో సంక్రాంతి శోభను స్టేజిపై ఆవిష్కరించిన తీరు చాలా ఆకట్టుకుంది.

ఆ తర్వాత అతిధులుగా వచ్చిన ఇండోరు డి.ఐ.జీ. శ్రీనివాస్‌గారు (ఈయనది పిఠాపురం, మృదుభాషి, సహృదయుడు), ఆయన సతీమణి శ్రీమతి సుచరితగారు, ఇండోరు తెలుగు విజ్ఞాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రామా రావుగారు (రిటర్‌మెంట్ అయ్యిన తరువాతకూడా ఏ మాత్రం వూపు తగ్గని తెలుగు భాషాభిమాని), సీనియర్ సైంటిస్ట్ భాస్కర్‌రావుగారి చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
తమాషా ఏమిటంటే లక్కీ డిప్‌లో నాకు బహుమతి రావటం.. అంత కన్నా లక్కీ ఏమిటంటే ఇంత మంది తెలుగువాళ్ళతో పరిచయం కావటం. అందులో ప్రసాదుగారు, శాస్త్రిగారు, ఫణీంద్రగారు, నారాయణగారులంటి సాహిత్యాభిమానులు దొరకటం..!! డిన్నర్ కానిచ్చి భారంగా ఒకరికొకరం శెలవు పుచ్చుకొని ఇళ్ళు చేరాం.

18 వ్యాఖ్య(లు):

prasad చెప్పారు...

మిత్రాస్

కార్యక్రమానికి సంబధించిన మరి కొన్ని చిత్రరాజములను ఇస్నిప్స్.కాం లో అతికించి(upload ని తెలుగులొ ఏమంటారో 'పైకి నెట్టి 'అని కాదు కదా!) మీకు తెలియ చేస్తాము.

అజ్ఞాత చెప్పారు...

ఎగుమతి అనచ్చు..!! తెలుగు భాషే వాడాలన్నది నియమమేమీకాదు. వాడితే ముదావహం.

అజ్ఞాత చెప్పారు...

చాలా చక్కగా వర్ణించారండి.

durgeswara చెప్పారు...

మీరు వ్రాసినది చదువుతుంటే స్వయంగా పాల్గొన్నట్లు అనిపించింది. ఇంతమంది తెలుగువాళ్లను కలుసుకుని మాతృభాషకోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయము.

prasad చెప్పారు...

మా ఆవిద ఉవాచ :


మీ బ్లాగు లొ సంక్రాంతి గూర్చి ఇంత చక్కగా విపులంగా వ్రాశారు. అది చదివి మాకు బాగా సంతోషం వేసింది. దీన్ని అమ్రికా లో ఉన్న మా అక్క , ఆడపడుచు లతో మిగతా బంధువులతొ పంచుకొనే మంచి అవకాశం కల్గించారు. చాల సంతోషం.

చీరకు అంచు ఎంత అందమో నిన్నటి ప్రోగ్రాంకు మీ వ్యాఖ్యలు అంతె అందాన్ని ఇచ్చాయి.

శ్రీధర్ న్యాపతి చెప్పారు...

సత్యప్రసాదు గారు!

ఇందోరు సంక్రాంతి సంబరాలలో మీ తెలుగు బ్లాగుల ప్రచారం మాలో తెలుగు భాష మీద మరింత అభిమానాన్ని పెంచింది. మీ తెలుగు బ్లాగుల ప్రచారం (ఇంకో విధంగా చెప్పాలంటె బ్లాగుల ద్వారా తెలుగుకు ప్రాచుర్యం) చాలా అభినందనీయం.

అజ్ఞాత చెప్పారు...

Nice write dear Prasad. I appreciate your work.

Unknown చెప్పారు...

వ్యాఖ్యలు వ్రాసిన మిత్రులందరికి నెనర్లు.
శ్రీధర్‌గారు, ప్రసాద్ గారు, రామారావు గారు,
ఇప్పటికే మీకు బ్లాగులు తెరవటంతో అనుబంధం వుంది కాబట్టి (ప్రొఫైల్ వ్యూస్‌లో చూశాను) మీరు త్వరలో తెలుగు బ్లాగులు ప్రారంభిస్తే నా ప్రయత్నం సార్థకమైనట్లు భావిస్తాను.

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

సత్యప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.
e-తెలుగు ( తెలుగు బ్లాగుల) ప్రచారానికి మీరు చక్కని వేదిక ఎన్నుకున్నారు.ఇటువంటి సమావేశాలు చాలా పట్టణాలలో జరుగుతూ ఉంటాయి.
వచ్చేవారందరూ తెలుగు భాషాభిమానులే కనుక ఇవి ఆంధ్రేతర ప్రాంతాలలో మన ప్రచారానికి సరియైన వేదికలు.ఇటువంటి మరికొన్ని ప్రాంతాలలో ఉండే తెలుగుబ్లాగర్లు ముందుకు రావాలని కోరుకుందాం.

శ్రీధర్ న్యాపతి చెప్పారు...

"నెనర్లు" అనగానేమి? వివరించగలరు.

అజ్ఞాత చెప్పారు...

నెనర్లు - ఆంగ్ల థాంక్స్ కి తెలుగు అన్వయం. వ్యవహారికంలో అంత వాడకంలో లేదు కాని అంతర్జాలంలో చాలా తరచుగా వినిపిస్తుంటుంది. తెలుగు బ్లాగులు మరిన్ని చదివితే మీకే తెలుస్తుంది.

జీడిపప్పు చెప్పారు...

చాలా మంచిప్రయత్నం. అభినందనలు

అజ్ఞాత చెప్పారు...

pannendu samvastarala kritam naa paata gnapakalanu malli ee vidhamga akshara rupam lo kanipinchindi. Akkada swayam gaa lekapoina kuda unnatulgane varnincharu. Chaala Santosham.

Prasad DVR
Poorva Udyogi.

శ్రీధర్ న్యాపతి చెప్పారు...

"నెనరు" తెలుగు మూలం లో ఉన్నదా? లెదా అంతర్జాలంలో పుట్టిందా?

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్‌గారు,
ఈ పదం విషయమై తెలుగు గూగుల్ గుంపులో చర్చ జరిగింది. అది తెలుగు పదమే.. మరిన్ని వివరాలు కావాలంటే telugublog@googlegroups.com కి ఒక వేగు (మైల్) పంపండి. ఇలాంటి పదాలు వెలికి తీయటంలో/సృష్టించడంలో పేరుపడ్డ తాడేపల్లిగారి బ్లాగులు చూడండి:

http://www.tadepally.com/
http://telugubhaasha.blogspot.com/

అరిపిరాల

సుజాత వేల్పూరి చెప్పారు...

ఇంత షడ్రసోపేతంగా ఇక్కడ తెలుగు నేలమీద మేము కూడా భోంచేయలేదు కదండీ!ముగ్గులు, బొమ్మల కొలువులు...ఎంత వర్ణశోభితంగా ఉందో మీ సంక్రాంతి!

శ్రీధర్ గారు,
నెనరు అనే పదానికి అంతర్జాలమో ప్రాచుర్యం తెచ్చింది తాడేపల్లి గారే! ఆంగ్ల పదాలకు సమానార్ధక తెలుగు పదాలను సృష్టించడంలో వారికి వారే సాటి. బ్లాగు కు సరైన తెలుగుపదం ఏమిటో తెలుసా...సారణి ! ఇదీ ఆయనే చెప్పారు.

y.sudarshan reddy చెప్పారు...

it is an amazing job..ur effort is commendable..u r encouraging telugu blogs and also please encourage us also..by forwarding our blogs http://telugudevotionalswaranjali.blogspot.com to ur friends..
we have started a forum for "bhakti", we invite u to to register
in the forum and contribute ur collections/links to spread bhakti tatva to
reacah every one.
url:http://www.svaranjali.com/
wish u good luck
bhagavad sevalo
mee
ysreddy(ysreddy94hyd@gmail.com)
http://telugudevotionalswaranjali.blogspot.com

Unknown చెప్పారు...

ఫ్రియ మిత్రులు ప్రసాద్ గారికి,

నమస్తే.

ఇందోరు లొ సంక్రాంతి గురించిన మీ వ్యసం ఇప్పుదే మీ బ్లాగు లొ చూసాను. ( గత మూదురొజులుగా నా కంప్యుటరు మొరాఇస్తొంది) చాల వివరం గా వ్రాసారు. మీ పరిచయ భాగ్యం , అంతమంది తెలుగువారిని కలవదం (వూరు కాని వూరి లొ) మీరు చేప్పినట్టు మంచి భొజనం చాలా చాలా బాగున్నై. మీరు ఇచ్చిన సమాచారం మేరకు నేఎను కూడా ఈ వుత్తరం లేఖినిలొ తయారు చేసి పంపిస్తున్నను.
మీ వ్యాసం లొ రెండు మూడు సందర్భాలలొ నా పేరు ప్రస్తావన వుండడం నన్ను అశ్చర్యపరచింది. థన్యుడిని. మీ వంటి వారి పరిచ్య భాగ్యం కలిగించిన సందర్భానికి కారకులైన క్యాట్ వారిని కూడా మనస్పూర్థిగా అభినందిస్తూన్నాను. ఆలాగే పండగ సంబరాల గురించి చాలా వివరం గా వ్రాసిన మిమ్ములను కూడా అభినందిస్తూ………………


మిత్రుడు
ఫణీంద్ర