చిలక రాయబారం (కథ)

(ఈ కథ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 6 జూన్ 2010లో ప్రచురితం)"చిలకా ... చిలకా ...''


"... ... ...''


"పలకవేమే?'' రెట్టించింది ప్రియ.


ఏమిటన్నట్టు చూసింది చిలక.


"నాకో సాయం చేసి పెడతావా? నేను ఒక వుత్తరం రాసిస్తా. ఆయనకి ఇస్తావా?'' అడిగింది ప్రియ.


ఇస్తానన్నట్లు తలాడించింది చిలక.


ఆ అంగీకారమే చాలు ... వెంటనే ప్రియ వెతికి వెతికి ఎర్రటి గులాబీరంగు కాగితం తెచ్చుకుంది. చిక్కని రంగుతో రాసే కలాన్ని అందుకుంది.


కావ్య కన్యలా మంచం మీద పడుకొని ఉత్తరం మొదలుపెట్టింది.


ఉత్తరం నిండా ఎంత ప్రేమో, విరహమో, ఎన్నెన్ని అలకలో, కలతలో...!! రెండు సార్లు ఆ ఉత్తరాన్ని ఆప్యాయంగా చదువుకొని,


మురిసిపోయి, ముసిముసిగా నవ్వుకొని ఎంతో జాగ్రత్తగా మడిచింది.


"ఇస్తావుగా చిలకమ్మా ... శరత్ చేతికే ఇవ్వు ... మర్చిపోవుగా ...'' అంటూ పదే పదే చిలకకి చెప్పింది ప్రియ. ఆ కాగితం


అందుకొని రివ్వున వెళ్లిపోయింది చిలక.
***


శరత్ ఉత్తరం అందుకోగానే ఆనందంతో పరవశుడయ్యాడు. ఎంతకాలమైంది ఇలా ఉత్తరాలు రాసుకొని ... పైగా ఇలా చిలకతో పంపుతుందని అస్సలు ఊహించలేదు. కళ్లతోనే చిలకకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఉత్తరాన్ని పొదివి పట్టుకున్నాడు. పసిపిల్లని తాకినట్లు ముద్దుగా తాకాడు. గులాబిరంగు కాగితం నుంచి గులాబిపువ్వు గుబాళింపు. ప్రియ ఎప్పుడూ ఇంతే... ప్రేమలో పడి మునిగి తేలిన రోజులలోనూ ఇంతే... ఉత్తరం రాసిందంటే ఇలాగే మత్తెక్కించే మల్లెల పరిమళాలో, సంపెంగ సువాసనలో ఉండాల్సిందే. సరే సరే... ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటే ఇక ఉత్తరం చదివినట్లే. పైగా నిద్రముంచుకొస్తోంది. ఉత్తరం తెరిచాడు.


"నా శరత్ కాలమా...


ఎన్నాళ్ళైంది నిన్ను చూసి.. నవ్వకు. నాకు తెలుసు మూడురోజులే అని. కానీ క్యాలెండర్లో ఒక గడి నుంచి మరో గడికి మధ్య ఎంత దూరముందో నువ్వెప్పుడైనా కొలిచావా? మారిన తేదీలు కాదు అవి మారడానికి పట్టే గంటలు, నిమిషాలు, క్షణాలు గుర్తించావా? ఆ క్షణాల బరువెంతో ఎప్పుడైనా అడిగావా?


నిన్ను చూడాలని ఎంతగా అనిపిస్తోందో తెలుసా? ఒక్కసారి కనిపించిపోరాదూ... నిన్ను కాసేపు చూసిన జ్ఞాపకంతో ఎన్ని వేల క్షణాలైనా


ఆనందంగా గడిపేస్తాను.


నాకు తెలుసు నువ్వేమంటావో ... నన్ను చూడాలనిపిస్తే అన్నీ వదిలేసి నా దగ్గరకి రా... అంటావు. అంతే కదా? మనకోసం మన ప్రేమకోసం అలాగే అన్నీ వదిలేసి నీతో కలిసి రాలేదూ. కాని ఇప్పుడు ఏం చెయ్యగలం చెప్పు ... మనమంతట మనమే గాజుగోడల గదుల మధ్య ఇరుక్కుపోయాం... మనకోసం కాకపోయినా మనకి పుట్టబోయే బిడ్డకోసమైనా మరికొంత కాలం... ఓహ్... చెప్పేశానా? నువ్వు కలిసినప్పుడు చెప్పాలనుకున్నా... అది విన్నప్పుడు నీ కళ్లలో ఆశ్చర్యంతోనో, ఆనందంతోనో వచ్చే మెరుపు చూడాలనుకున్నా... ప్చ్... అయినా నీ ఆనందాన్ని నేను ఊహించుకోగలనులే ... అదిగో నీ చిరునవ్వు నాకు కనిపిస్తోంది ... ఈ వాక్యం చదివాక మరికొంచెం పెద్దదైన నీ నవ్వు నాకు వినిపిస్తూనే ఉంది....


మరో మూడు రోజులు ... నువ్వు వచ్చేస్తావు ... వచ్చేస్తావు కదూ ...!


నీ ప్రియ


(ఈ విషయమంతా నీకు ఫోన్ చేసి చెప్పొచ్చు... కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు బిజీగా ఉన్నానంటావు. లేదా... నిద్ర వస్తోందంటావు. అదిగో ఇప్పుడు కూడా ఆవలిస్తున్నావు కదూ... సరే ఇక ఉంటాను... హాయిగా నిద్రపో...) చదువుతూనే నిద్రపోయాడు శరత్.


***


ప్రియా,


నేను వచ్చాను ... నిజంగా వచ్చాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావప్పుడు. నా గురించే కలలు కంటున్నట్లున్నావు. లేకపోతే మనకి పుట్టబోయే పాపను తలచుకుంటున్నట్లున్నావు ... నిద్రలో చిన్నగా నవ్వుతున్నావు. అబ్బ ... ఎంత బాగుందో తెలుసా నిన్ను అలా చూస్తుంటే ... ! అందుకే అలానే చూస్తూ ఉండిపోయాను. నీలో కొత్తగా వచ్చిన మార్పు వల్లేమో... ఇంకా అందంగా కనిపిస్తున్నావు ... ఒక్కసారి నిద్రలేపి పలకరిద్దామనుకున్నాను. కానీ, ఎందుకో అలాగే బాగుందనిపించింది. ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి వెళ్లక తప్పలేదు. ఎప్పుడు నిద్రపోయానో గుర్తులేదు. లేచి చూసేసరికి నువ్వు లేవు. ఇంకా రెండు రోజులు ఆగాలి మనం కలవడానికి ... రెండు రోజులు !! నీకోసం ఎదురుచూస్తూ ... - శరత్
(నీలాగ నేను కవిత్వం రాయలేకపోయినా, ఉత్తరాలు రాయటం మాత్రం నిన్ను ప్రేమించిన తరువాతే నేర్చుకున్నాను. ఫోన్ చెయ్యకు... ఇదే బాగుంది)


చిలక ఇచ్చిన ఉత్తరం చదివి ప్రియ చిన్నగా నవ్వుకుంది. కాగితాన్ని మడిచి తన నీలంరంగు డైరీలో పెట్టుకుంది. పక్కనే ఎర్రరంగు డైరీ... శరత్ది.


అందులో తను వ్రాసిన ఉత్తరాలు ... రంగురంగులవి కనిపిస్తున్నాయి. ఒకసారి తీసి చూద్దామనుకుంది. అంతలోనే వద్దనుకుంది. ఆకుపచ్చటి కాగితం తీసుకొని శరత్ ఉత్తరానికి జవాబు మొదలుపెట్టింది.


"శరత్ వెన్నెలా ... నువ్వు వచ్చిన సంగతి నాకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? నీ రాక నా మనసులో వెయ్యి వీణలై మోగదూ ... నిద్రలో కూడా నువ్వొచ్చావని తెలిసి నవ్వుకున్నానేమో... అలా నువ్వు నన్ను తదేకంగా చూడ్డం బాగుందనే నాకు మెలకువ రాలేదేమో. నేను కూడా నిన్ను చూశాను తెలుసా? అవును ... నువ్వు నిద్రపోగానే నేను లేచాను. ప్రశాంతంగా నిద్రపోతున్నావు ... కలలో నేనో, మరి మన బాబో ... (అవును... నువ్వన్నట్లు పాప కాదు ... బాబు ... నీ పోలికలతో మన బాబు) వచ్చినట్టున్నాం. అయినా నీలాగ నేను అలాగే చూస్తూ ఉండలేకపోయాను. లేపాలని చూశాను. మగత కళ్లతో చూసినట్లున్నావు కూడా... నిజంగ చూశావో లేదో ... మళ్ళీ నిద్రలోకి ... సరే ఇక్కడే ఆపేస్తున్నా... మన చిలక తొందరపడుతోంది ...
రేపేగా ఆదివారం.. మనం కలిసే రోజు.. ఈ రేపటికోసం వారం కాదు ఎన్ని యుగాలైనా వేచి ఉంటాను.


రేపటి కోసం ...


ప్రియ''
అప్పటికే వెళ్లిపోబోతున్న చిలకని బ్రతిమిలాడి ఆపి ఉత్తరం ఇచ్చి "ఇస్తావు కదూ...'' అంది ప్రియ.


"ఇస్తానమ్మా... అయినా విచిత్రం కాకపోతే ఒకే ఇంట్లో ఉండే మొగుడూ పెళ్లాలు ఇట్టాగ వుత్తరాలు రాసుకోవడమేంది? పోనీ అయ్యగారూ మీరూ ఇద్దరూ పగలూ రేయీ కాకుండా ఒకటే షిప్టు వుద్యోగాలు చూసుకోకూడదూ...'' నవ్వుతూ అంది పనమ్మాయి చిలకమ్మ.


Category: