అసంకల్పిత చర్యలు..!!
మనం నిద్రలో జోగుతున్నప్పుడు భుజం మీద దోమ కుట్టిందనుకోండి, ఠప్పున చెయ్యి లేచి దాని మీద పడి ఆ దోమని పరమపదానికి చేరుస్తుంది. దీన్నే అసంకల్పిత ప్రతికార చర్య (Involuntary reflex action) అని చెప్తుంది సైన్సు. ఇలాంటి చర్యలకి మన మెదడు కాకుండా వెన్నెముక పైభాగం నుంచి సూచనలు అందుతాయట. అంటే మెదడు(అవసరం) లేని పనులని ఈ అసంకల్పిత చర్యలంటారన్న మాట.సైన్సు పరంగా అలాంటివి కాకపోయినా దాదాపు ఇలాంటివే అసంకల్పిత చర్యలు ఎన్నో రోజూ మన చుట్టూ చూస్తూనే వుంటాం. మనం అందరం చేస్తూనే వుంటాం. యస్పీ బాలు పాటవినగానే తలాడించడం, బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వురావటం, రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ని చూస్తే చొంగ కారడం లాంటివి చాలా వుదాహరణలు వున్నా, నేను చెప్పబోయేవి ఇంకొంచెం పెద్దవి.
ఎవరినా ఎవరినైనా పెన్ను అడిగేటప్పుడు చూడండి గాల్లో ఏదో రాస్తున్నట్లే చేతిని వూపి అడుగుతుంటారు. పెన్ను ఇచ్చే వ్యక్తికి పెన్నుతో ఇలా రాయాలి సుమా అన్నట్టు ఆ సంజ్ఞ ఎందుకు చెప్పండి? టైం అడిగేటప్పుడు కూడా మన చేతికి వాచీ వున్నట్లే చెయ్యి ఎత్తి అడుగుతాం. మన చేతికి వాచీ లేకపోయినా అలా ఎందుకు చూస్తామో తెలియదు.. అవతలి వాళ్ళకి వాచి అక్కడుంటుందని గుర్తు చెయ్యడానికేమో అర్థం కాదు..!! ఒక్కోసారి మనం బస్సు రన్నింగ్లో దిగాల్సివస్తుంది (హైదరాబాదులో అయితే రోజూ దిగాల్సి వస్తుంది, కాబట్టి హైదరాబాదీయులకి ఈ వుదాహరణ మినహాయింపు). అలాంటప్పుడు సాధారణంగా బస్సు వెళ్తున్న వైపు కాకుండా వెనక్కు దిగి, ఆ క్షణంలో సైన్సు చేసిన మోసాన్ని గ్రహించేలోపలే కిందపడుతుంటాం. ఇలంటివాటివల్ల మనకే ఇబ్బంది కానీ వెరే ఎవరికీ ఇబ్బంది వుండదు. కానీ, కొన్ని వున్నాయి - మనం చేసే అసంకల్పిత చర్యలవల్ల అవతలి వారికి చిరాకో, నవ్వో తెప్పిస్తుంటాయి.
సినిమాహాల్లో కలిసిన మిత్రుణ్ణి - "ఏమోయ్ సినిమాకు వచ్చావా" అని అడగటం ఇలాంటిదే. నవ్వేసే మిత్రుడైతే ఫర్లేదు కానీ చిరాకు పడే మిత్రుడైతే - "లేదోయ్.. మీరు ఇంటర్వెల్లో కాల్చి పడేసే సిగరెట్ పీకలు ఏరుకునేందుకు వచ్చాను" అంటూ అక్కసునంతా వెళ్ళగక్కుతాడు. ఇలాంటివే సదరు సినిమా కౌంటరు దగ్గర కూడా జరుగుతుంటాయి. మనం లైన్లో నిలబడటమే ఒక దైవ సంకల్పం లాగా, సిక్కిం బంపర్ లాటరీ తగిలినట్టు సరిగ్గా మనం కౌంటరు ముందుకు రాగానే టికెట్లు అయిపోతాయి. కౌంటరులో టికెట్లు అయిపోయాయి అనగానే - "కొంచెం చూడండి.." అనో "ఒక్కటి కూడా లేదా" అనో మన నోటి నుంచి అసంకల్పితంగా వచ్చేస్తుంది. చిల్లర విషయంలో కూడా అంతే - ఏ హోటల్లో క్యాషియరో, ఆటో డ్రైవరో "చిల్లర లేదు సార్" అంటే "చూడవోయ్" అనేస్తాం అసంకల్పితంగా. అంటే అవతలి వ్యక్తికి "నేను నిన్ను నమ్మడంలేదు" అని అన్యాపదేశంగా చెప్పడమే కదా?
రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ కౌంటర్ దగ్గర ఇలాంటివే మరి కొన్ని కనిపిస్తాయి. ఎంక్వైరీ క్లర్క్ దగ్గరకు రాగానే ఫలానా తెనాలికి లాస్ట్ ట్రైన్ ఎన్నిగంటలకి అని అడుగుతాం. క్లర్క్ "తొమ్మిది గంటలకి" అని చెప్పగానే మనలో తొంభై శాతం మంది "దాని తరువాత ట్రైన్ లేదా" అంటాము. మనం అడిగింది, ఆ క్లర్కు చెప్పింది లాస్ట్ ట్రైన్ గురించి. దాని తరువాత ఇంకో ట్రైన్ ఎలా వుంటుంది? వుంటే ఇది లాస్ట్ ట్రైన్ ఎలా అవుతుంది?..అదేమి చిత్రమో ఈ ఆలోచన మన బుర్రకి రానే రాదు..!! ఇలాగే ఫస్ట్ ట్రైన్ కన్నా ముందు వేరే ట్రైన్ లేదా? అని కూడా అడుగుతుంటాము.... కనీసం నెక్ష్ట్ ట్రైన్ గురించి అడిగినప్పుడు సమాధానం "ఆరు గంటలకి" అని వినగనే "ఈ లోపల ఏం లేదా?" అంటాం. ఈ లోపల ట్రైన్ వుంటే ఆరు గంటలకి అని ఎందుకు చెప్తాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ట్రైన్ ఎక్కడానికి వచ్చి, ఆ రైలు అందుకోలేకపోతే కూడా ఇలాంటి అనుమానాలే వస్తుంటయి. టీసీ రైలు వెళ్ళిపోయిందని చెప్పగానే "ఎంతసేపైంది" అంటాం. ఎంతసేపైతే మాత్రం ఏం చెయ్యగలం? పట్టాల మీద పరుగెత్తి అందుకోలేం కదా? అన్నీ అసంకల్పిత ప్రశ్నలే...! అన్ని వ్యర్థమైన ప్రశ్నలే.. ఎప్పుడైనా ఆలోచించారా?


ఇంకో సంగతి చెపుతా వినండి - క్యూలో నిల్చున్నప్పుడు మనకో దురలవాటు వుంది. ఎదుటివాడి వీపు మీద చెయ్యి ఆనించి చిన్నగా తొయ్యటం. సినిమా హాలులోంచి బయటికొచ్చేటప్పుడైనా విమానంలోనుంచి దిగేటప్పుడైనా ఇలంటివి తప్పవు. మరి అదేంటో.. తాము వెనక వున్నామని చెప్పకపోతే ముందు వున్నవాళ్ళు ముందుకు కదలరేమో అని అనుమానం అనుకుంటా వీరికి. ఇలాంటి వారే సిగ్నల్ దగ్గర ఆగి హారన్ కొడుతుంటారు. ముందు వున్నవాడు సిగ్నల్ కోసం ఆగాడే కాని, సైట్ సీయింగ్ కోసం కాదన్న సంగతి మరిచిపోతుంటారు వీరు.
రోడ్డుకు అడ్డంగా దాటే వ్యక్తులని గమనించండి - ఒకటి వాళ్ళు జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు దాటరు. రెండు దాటేటప్పుడు రెండు వైపులా వస్తున్న వాహనాల్ని చూసుకోరు. అసంకల్పితంగా చెయ్య ట్రాఫిక్ పోలీసు "ఆగుము" అన్న బోర్డు పట్టుకున్నట్టుగా పెట్టి ట్రాఫిక్‌కి అడ్డంగా పరుగెత్తుతారు. ట్రాఫిక్ పోలీసులు ఆగమంటేనే ఆగని వాహనచోదకులు ఎవరో రోడ్డు దాటుతూ చెయ్యి చూపిస్తే ఆగుతారా?
మనం ఎక్కడో ఆలోచిస్తూ బండి నడపడం, సంతకం చెయ్యడం వంటివి కూడా చాలా వరకు అసంకల్పితంగానే జరుగుతాయి. బండి అసంకల్పితంగా నడపగలను కదా అని కొంతమంది ఔత్సాహికులు బండి నడుపుతూ మొబైల్‌ఫోన్ వాడి అసంకల్పితంగానే ఏక్సిడెంట్లూ చేసుకుంటారు...!! ఇలాంటి అసంకల్పితమైన పనుల విషయంలోనే కొంచెం జాగర్తగా వుండాలి..!!


5 వ్యాఖ్య(లు):

ఆ.సౌమ్య చెప్పారు...

కేక మాస్టారూ, భలే గమనించారు అన్నీ....కానీ ఇవన్ని అసంకల్పిత ప్రతీకార చర్యలేనంటారా? నాకెందుకో కొన్ని మనం కావాలని, తెలిసీ చేస్తామనిపిస్తోంది. పోతేపోయింది గానీ చివర్లో చురకలు బాగా అంటించారు.

Sheshu Kumar Inguva చెప్పారు...

this is called lack of civic sense. i have raised a query to Govt in Public grievance to have Civic sense as compulsory subject. will see what govt says.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Nice post.

jeevani చెప్పారు...

నిజమే బావుందండీ! అలాగే ఏదైనా కొనడానికి వెళ్లి అది మంచి క్వాలిటీనే కదా అని అమ్మేవాడిని అడగడం. అది బాలెదని వాడెందుకు చెబుతాడు?
ఫంక్షన్లలో కెమెరా అంత దూరంలో ఉండగానే శవంలా బిర్ర బిగుసుకుపోవడం. నిజానికి అప్పటికి క్యాజువల్గా హాయిగా ఉంటారు. :)

కిరణ్ చెప్పారు...

excellent andi.