నాకేంటి? అహ నాకేంటని..!!

అహ నా పెళ్ళంట అనే సినిమా చూశారా? అవునండి..నేను మాట్లాడేది కోటశ్రీనివాసరావు పాత్ర లక్ష్మీపతి గురించే..!! మన అరగుండు బ్రహ్మానందం చెప్పినట్టు - "బోరింగు పంపులో ముందు కొంచెం నీళ్ళు పోయందే ఎలా నీళ్ళు బయటకు రావో.. అలాగే లక్ష్మీపతిగారికి చేతిలో బరువు పడందే పని జరగదు.. (పరమ బోరింగు ముఖం..!!)"

ఇలాంటి మనుషులు మనకి రోజు తగులుతూనే వుంటారు..!! ఏ విషయమైనా మనకేంటి అని అని ఆలోచించిగాని ఏ పనైనా మొదలు పెట్టరు. ఇలాంటి వాళ్ళని చూస్తే మనకందరికీ చిరకు రావటం సహజం. అయితే వీళ్ళకన్నా దారుణంగా మనం ప్రవర్తిస్తామనేది మనం చాలా సులభంగా మర్చిపోతుంటాం. నిజానికి ఇలాంటి లక్ష్మీపతులకన్నా మనలాంటి వారి వల్లే సమాజానికి చెడు జరుగుతుంది. నమ్మటం లేదా..?? లక్ష్మీపతి కన్నా మనం చెడ్డవాళ్ళమా అని కోపం వస్తోందా? శాంతం.. శాంతం.. సాంతం విన్నాక మీకే తెలుస్తుందిగా..!!

మనం చేసే ఏ పనికైనా లాభం నష్టం రెండూ వుంటాయి. అయితే ఈ లాభం నష్టం అనేవి డబ్బుతో మాత్రమే కొలవలేము. ఈ లాభ నష్టాలను బేరీజు వేసుకోని, దాని అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. వుదాహరణకి ఈ రోజు ఆఫీసుకి వెళ్ళాలా లేదా అని ఆలోచన వచ్చిందనుకోండి - ఇంట్లో వుండటం ద్వారా కలిగే లాభాలు (ఎక్కువసేపు నిద్ర పొవటం నించి, మనకి ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ టీవీలో చూడటందాకా) నష్టాలు (ఆఫీసులో పని మిగిలిపోవటం నించి బాసు గారికి కోపం రావటం దాకా) అన్నీ ఆలోచించే కదా నిర్ణయించుకుంటాం. ఇంతవరకూ బాగానేవుంది - కొంచెం స్వార్థం వున్నా (లక్ష్మీపతిలాగానే), అంతమాత్రం ఆలోచించకపోతే "తనకు మాలిన ధర్మమౌతుంది".



అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటి అంటయ్యా అంటే - మనం బేరీజు వేసుకోవాల్సిన మరో విషయాన్ని మర్చిపోవడం. అదేమిటంటే మనం చేసే పని వల్ల మన పక్కవారికి, చుట్టుపక్కలవారికి, ఇంకా పెద్దదిగా చూస్తే సమాజానికి కలుగుతున్న లాభనష్టాల గురించి ఆలోచించకపోవడం. ఈ విషయం అర్థమవ్వాలంటే ఒక చిన్న వుదాహరణ-


ప్రతి నెల రెండొవ ఆదివారం తెలుగు బ్లాగర్ల సమావేశం కృష్ణకాంత్ వుద్యానవనంలో జరుగుతుంది. ఈ సమావేశానికి వెళ్ళలా లేదా అనేదే సమస్య అనుకుందాం. వెళ్ళక పోతే ఇంట్లో ఒక కునుకెయ్యచ్చు, లేదా టీ.వీ.లో వచ్చే ఏ రియాలిటీ షోనో చూడచ్చు - ఇవీ లాభాలు. ఈ-తెలుగు చర్చల్లో పాల్గొనలేకపోవటం, కొంతమంది మిత్రులతో కలిసి సమయం గడిపే అవకాశం లేకపోవటం ఇలాంటివి కొన్ని నష్టాలు.

ఒక వేళ వెళ్తే - అక్కడిదాకా బండి మీద వెళ్ళటం, కాస్తో కూస్తో డబ్బులు ఖర్చు, ఇంట్లో పెళ్ళాం పిల్లలు - "ఆదివారం కూడా ఏదో పని పెట్టుకున్నారని" సణగటం అనేవి కొన్ని నష్టాలు. (ఇంకా చాలా వుండచ్చు.. అవి ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు) మరి లాభాలు ఆలోచిస్తే కొంతమంది మిత్రుల్ని, సాహిత్యకారుల్ని కలవటం, ఈ-తెలుగు చర్చల్లో పాల్గొనడం వంటివి వుండచ్చు.



వీటి ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం సహజం. అయితే ఇక్కడ ఆలోచించడం మర్చిపోయిన విషయం ఏమిటంటే - మనం వెళ్ళడం వెళ్ళకపోవడం వల్ల ఈ-తెలుగు/తెలుగు బ్లాగర్ల సఘానికి ఏదైనా నష్టం కలుగుతుందా? అని

"ఛ! వూరుకోండి మాష్టారు.. నేను వెళ్ళకపోతే ఈ-తెలుగుకి నష్టం ఏమిటి? నేనేదో సముద్రంలో నీటిచుక్కగాడిని" అంటున్నారా..!! అలా అనుకోవడమే పెద్ద సమస్య. సముద్రమైనా ఒక్క నీటి చుక్కతోనే మొదలౌతుంది.. ప్రతి నీటిచుక్కా కలిస్తేనే సముద్రమౌతుంది. అందువల్ల ప్రతి నీటి చుక్కా సముద్రానికి అవసరమూ, అమూల్యము.


సరే మనం వెళ్ళకపోవడం వల్ల ఈ-తెలుగుకి తెలుగు బ్లాగర్ల సంఘానికి జరిగే నష్టం ఏమిటి? ఆలోచించండి - సభ్యులు కరువైతే సంఘం అస్థిత్వాన్ని కోల్పోతుంది. ఆ సంఘం అవసరం కరువైపోతుంది. ఒకరిని చూసి మరొకరు - ఆ ఈ మధ్య ఎవరూ రావట్లేదు - అనుకుంటూ తాము రావటం మానేస్తారు. ఇలాంటి సమావేశానికే విలువపోతుంది. నిర్వహించేవారిని నిరుత్సాహం ఆవహిస్తుంది..!! చివరికి సదరు సంఘానికి మనుటయా మరణించుటయా అనే ప్రశ్న తలెత్తచ్చు.



"ఇవన్నీ నావల్లే జరిగుతాయా" అని మీరనచ్చు - మీరంటే ఎవరు? మీరొక్కరే కాదుకదా - మీలాంటివారే అందరూ.. మీలాంటి వాళ్ళే ఎందరో కలిస్తే మనం అందరం తయారౌతాం..!! అందరూ విడివిడిగా స్వంత లాభం చూసుకోని "అందరి లాభం" మర్చిపోయినప్పుడు.. అందరిలో మనం వున్నాం కాబట్టి ఆ "అందరి నష్టం" విడివిడిగా భరించాల్సి వస్తుంది. తికమకగా వుందా? సరే ఒక కథ చెప్తాను వినండి -




ఒక వూరి ప్రజలంతా కలిసి కరణంగారి ఆధ్వర్యంలో దేముడికి పాలతో అభిషేకం చేయాలనుకున్నారు. అందరూ చెంబెడు పాలు తెచ్చి పెద్ద గంగాళంలో పొయ్యాలని ప్రకటించారు. అయితే ఆ రోజు సాయంత్రం గంగాళంలో చూస్తే మొత్తం నీళ్ళే వున్నాయిట. ఎందుకని విచారిస్తే - ప్రతివాడు, అందరు పాలుపోసి నేనొక్కణ్ణే నీళ్ళుపోస్తే ఎవరికి తెలుస్తుందిలే అనుకోని అందరూ నీళ్ళు పోసారట..!!



ఆ రకంగా వాళ్ళంతా కలిసి చెయ్యాలనుకున్న పని చెయ్యలేకపోయారు. అలాగే ఒక సంఘంగా, ఒక సమాజంగా మనం చెయ్యాలనుకున్న పని చెయ్యలేకపోతే నష్టపోయే సంఘంలో, సమాజంలో మనం కూడా వున్నామన్న సంగతి మర్చిపోకూడదు. ఇలా "సొంతలాభం కొంత మానుకొని" ఆలోచించడం మొదలుపెడితే - ట్రాఫిక్, కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం లాంటి ఎన్నో సమస్యలకు సమాధానం దొరుకుతుంది. మనమంతా "అహనా పెళ్ళంట లక్ష్మీపతులం" కాదని నిరూపించుకునే అవకాశం కలుగుతుంది.

5 వ్యాఖ్య(లు):

చెరసాల శర్మ | ప్రవీణ శర్మ చెప్పారు...

నేను ఏడాది క్రితమే ఈ-తెలుగు సభ్యత్వం తీసుకున్నాను. నేను వచ్చింది మాత్రం మే, జూన్ నెలల మీటింగులకే. కొంత కాలం హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ భయం, కొంత కాలం తెలంగాణా, సమైక్యాంధ్ర బంద్ లు, రైల్ రోకోలు వల్ల రాలేకపోయాను.

K. మహేష్ కుమార్ చెప్పారు...

:) :)

చెరసాల శర్మ | ప్రవీణ శర్మ చెప్పారు...

జూన్ నెల మీటింగ్ కి అరిపిరాల గారు కూడా రాలేదు. నేను, రవి చంద్ర గారు మాత్రమే వచ్చాం. కొత్తగా వరంగల్ నుంచి కది శంకరయ్య గారు వచ్చారు. నేను, రవి గారు కుర్చీ మీద కూర్చుని మాట్లాడుకుంటుండగా విని శంకరయ్య గారు మేము ఈ-తెలుగు వాళ్ళమని గుర్తు పట్టారు.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) చెప్పారు...

నేనుండేది పెద్దాపురంలో. కాని ఎప్పుడైనా 2వ ఆదివారం భాగ్యనగరంలో కనక ఉండటం తటస్థిస్తే మటుకు e-తెలుగు సమావేశాలకు హాజరవుతాను అలా ఇప్పటివరకూ 3 సమావేశాలకు హాజరయినాను. .

నాగబ్రహ్మారెడ్డి చెప్పారు...

మీకు పోస్ట్ చేస్తె నాకేంటి? అహ నాకేంటని..!!